విజయవాడ, అఖండసూర్య: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చుట్టూ సాగుతున్న వివాదాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. తాజాగా 'పరకామణి' కేసును ప్రభుత్వం మళ్లీ తెరపైకి తేవడంపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆదివారం తిరుపతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి న్యాయ వ్యవస్థను, దైవత్వాన్ని అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ప్రచారాలను, ప్రజల దృష్టిని మళ్లించే 'డైవర్షన్' రాజకీయాలను ఆయన ఆధారాలతో సహా ఎండగట్టారు.
పరకామణి కేసుకు సంబంధించి గతంలోనే గౌరవ హైకోర్టు ఆదేశాల మేరకు ఏసీబీ (ACB) మరియు సీఐడీ (CID) విభాగాలు రెండు నెలల పాటు క్షుణ్ణంగా విచారణ జరిపాయని భూమన గుర్తు చేశారు. ఇద్దరు డీజీ స్థాయి అధికారుల పర్యవేక్షణలో విచారణ పూర్తి చేసి, నివేదికను ఇప్పటికే కోర్టుకు సమర్పించారని తెలిపారు. ప్రస్తుతం మూడు కీలక వ్యాజ్యాలు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వద్ద పెండింగ్‌లో ఉండగా, మళ్లీ కొత్తగా ఎఫ్.ఐ.ఆర్ (FIR) నమోదు చేయాలని చూడటం చట్టవిరుద్ధమని ఆయన స్పష్టం చేశారు. కేవలం తమకు నచ్చని వారిని వేధించడానికే, అత్యంత అవినీతిపరుడిగా ముద్రపడిన ఒక డీఎస్పీకి ఈ బాధ్యతలు అప్పగించి కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు.
శ్రీవారి లడ్డూ ప్రసాదం విషయంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు సైతం తప్పుబట్టిందని భూమన గుర్తు చేశారు. "సుప్రీంకోర్టు పర్యవేక్షణలోని సిట్ (SIT) విచారణలో లడ్డూ ప్రసాదంలో ఎలాంటి జంతువుల కొవ్వు లేదని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇందులో ఎలాంటి సంబంధం లేదని తేలిపోయింది. అయినా చంద్రబాబు అబద్ధాలు చెప్పడం మానలేదు" అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్తీ నెయ్యి మూలాలు చంద్రబాబు సొంత సంస్థలైన హెరిటేజ్ మరియు ఇందాపూర్ డెయిరీల వద్దే ఉన్నాయని, ఈ నిజాన్ని ప్రజలకు వివరిస్తామని ఆయన తేల్చి చెప్పారు. 2018లో లడ్డూ సువాసన కోసం 'ప్లేవర్డ్ ఘీ' కొనుగోలు చేసిన చరిత్ర చంద్రబాబుదేనని, అంటే అప్పట్లోనే కల్తీ నెయ్యి వాడారని అర్థమవుతోందని ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి దయనీయంగా ఉందని భూమన ఆందోళన వ్యక్తం చేశారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగా 130 మందికి పైగా సీఐలను వీఆర్ (VR) లో ఉంచి వేధిస్తున్నారని, వారికి జీతాలు కూడా అందడం లేదని విమర్శించారు. తిరుమల వంటి కీలక ప్రాంతాల్లో కూడా సరైన పోలీస్ అధికారులు లేకపోవడం ప్రభుత్వ వైఫల్యమేనని అన్నారు. నిధుల కొరతతో నిందితులను కోర్టుకు తీసుకెళ్లడానికి వాహనాలు లేవని డీజీపీ ప్రకటించడం రాష్ట్ర దుస్థితికి అద్దం పడుతోందని పేర్కొన్నారు.
చంద్రబాబు ఎన్ని కుట్రలకు పాల్పడ్డా, ఎన్ని డైవర్షన్ రాజకీయాలు చేసినా సత్యం ఎప్పుడూ దాగి ఉండదని భూమన కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు. భగవంతుడు మరియు న్యాయస్థానాలు చంద్రబాబుకు బుద్ధి చెప్పడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Comments
Leave a Reply