ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని 99 రోజులపాటు విజయవంతంగా అమలు చేయడంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం అత్యంత కీలకమని జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య పేర్కొన్నారు.
ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈ నెల 12వ తేదీన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు నిర్వహించనున్న శిక్షణ కార్యక్రమంపై మంగళవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సంబంధిత ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నూతనంగా ఎన్నికైన సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్‌లకు ఈ నెల 12వ తేదీన నిర్వహించనున్న శిక్షణ కార్యక్రమం ద్వారా పాలనపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించబడుతుందని తెలిపారు. శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లాల కలెక్టర్ల కు సూచించారు.
ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల కార్యాచరణకు ఇప్పటికే షెడ్యూల్ ఖరారు చేయబడిందని, దాని ప్రకారం జూన్ 12వ తేదీ వరకు చేపట్టనున్న కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేయడానికి అన్ని జిల్లాల అధికార యంత్రాంగం సర్వసన్నద్ధంగా ఉండాలని సిఎస్ తెలిపారు. ప్రజాప్రతినిధులు మరియు ప్రభుత్వ అధికారులు సమన్వయంతో పని చేస్తే ప్రజలకు మెరుగైన ఫలితాలు అందుతాయని ఆయన స్పష్టం చేశారు.
శిక్షణ కార్యక్రమంలో భాగంగా 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక, ప్రభుత్వ ఫ్లాగ్‌షిప్ పథకాలు, అలాగే సర్పంచులకు 2018 పంచాయతీ రాజ్ చట్టంఫై , మున్సిపల్ కౌన్సిలర్లు మరియు చైర్మన్‌లకు 2019 మున్సిపల్ చట్టం ఫై, అదే విధంగా వారి విధులు, బాధ్యతలపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని ఆయన సూచించారు.
కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య, ఈ నెల 12వ తేదీన ప్రజాప్రతినిధులకు నిర్వహించనున్న శిక్షణ కార్యక్రమానికి జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సిఎస్‌కు వివరించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా నుండి అడిషనల్ కలెక్టర్ పాండు, జడ్పీ సీఈవో జానకి రెడ్డి, సీపీఓ బాలశౌరి తదితరులు పాల్గొన్నారు.
Comments
Leave a Reply