జెనీవా: జెనీవా వేదికగా ఇరాన్‌తో జరుగుతున్న రెండో విడత అణు చర్చల్లో కొంత పురోగతి లభించిందని అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ ప్రకటించారు. అయితే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్దేశించిన ‘రెడ్ లైన్ల’ (లక్ష్మణ రేఖల) విషయంలో ఇరాన్ ఇంకా స్పష్టమైన అంగీకారానికి రాకపోవడం చర్చలకు ప్రధాన ఆటంకంగా మారింది. ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వాయుధాలను పొందకూడదన్నదే అమెరికా ప్రధాన లక్ష్యమని, ఒకవేళ ఆ దేశం అణ్వాయుధాలను సమకూర్చుకుంటే అది ప్రపంచవ్యాప్తంగా ఆయుధ పోటీకి దారితీసి అమెరికా భద్రతకు ముప్పుగా మారుతుందని వాన్స్ హెచ్చరించారు. అణ్వాయుధాలపై తమకు ఆసక్తి లేదని ఇరాన్ పైకి చెబుతున్నప్పటికీ, వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని ఆయన విమర్శించారు. దౌత్య మార్గాల ద్వారా ఈ సమస్యను పరిష్కరించేందుకు ట్రంప్ శతవిధాలా ప్రయత్నిస్తున్నారని, అయితే దౌత్యం విఫలమైందని భావిస్తే తదుపరి సైనిక చర్యలపై నిర్ణయం తీసుకునే అధికారం అధ్యక్షుడికే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
మరోవైపు, పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. గత కొన్ని రోజులుగా అమెరికాకు చెందిన డజన్ల కొద్దీ ఫైటర్ జెట్‌లు మధ్య ప్రాచ్య దేశాల వైపు కదులుతున్నట్లు విమాన రాకపోకల ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. ఇరాన్‌తో జరుగుతున్న ఈ చర్చలు కేవలం కాలయాపన కోసమేనని, దౌత్యం విఫలమైతే అధ్యక్షుడు ట్రంప్ మరియు ఆయన సలహాదారులు ఇరాన్‌పై సైనిక దాడికి సిద్ధమవుతున్నారని ఇజ్రాయెల్ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి ఈ చర్చలు సానుకూలంగా ఉన్నాయని చెబుతున్నప్పటికీ, ఇది కేవలం ప్రపంచాన్ని తప్పుదారి పట్టించే ‘పొగ తెర’ (స్మోక్ స్క్రీన్) అని ఇజ్రాయెల్ కొట్టిపారేసింది. రాబోయే రెండు వారాల్లో చర్చల్లోని అంతరాలను తొలగించేలా సమగ్ర ప్రతిపాదనలు ఇస్తామని ఇరాన్ హామీ ఇచ్చిన నేపథ్యంలో, ఆ గడువు తర్వాతే అమెరికా తన తదుపరి వ్యూహాన్ని ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.
Comments
Leave a Reply